Wednesday, March 2, 2011

తారాగణం: వెంకటేశ్, ఆర్తీ అగర్వాల్, ప్రకాశ్‌రాజ్, చంద్రమోహన్, సుహాసిని, సుధ, ఎమ్మెస్ నారాయణ, హేమ, సునీల్, తనికెళ్ల భరణి, సిజ్జు, సుదీప, గణేశ్, ఆషా సైనీ, పృథ్వీ, బ్రహ్మానందం, బాబూమోహన్, మల్లికార్జునరావు, చిట్టిబాబు, కల్పనారాయ్
కథ, మాటలు: త్రివిక్రం
పాటలు: సీతారామశాస్త్రి, భువనచంద్ర
సంగీతం: కోటి
గానం: ఎస్పీ బాలు, కుమార్ సాను, చిత్ర, హరిణి, శ్రీరాం ప్రభు, టిప్పు
ఛాయాగ్రహణం: కె. రవీంద్రబాబు
కూర్పు: ఎ. శ్రీకరప్రసాద్
కళ: పేకేటి రంగా
నృత్యాలు: సుచిత్రా చంద్రబోస్, సరోజ్‌ఖాన్, రాజశేఖర్
సమర్పణ: సురేశ్ ప్రొడక్షన్స్
నిర్మాత: స్రవంతి రవికిశోర్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయభాస్కర్
బేనర్: శ్రీ స్రవంతి మూవీస్
విడుదల తేది: 6 సెప్టెంబర్ 2001

పదేళ్ల క్రితం అమెరికాలో ఉద్యోగమన్నా, అమెరికా అల్లుడన్నా మహా క్రేజ్. ఈ పరిణామం మన సమాజంలో తలెత్తడానికి కారణమైంది సాఫ్ట్‌వేర్ బూం. దాన్ని దృష్టిలో ఉంచుకుని 'అమెరికా' వెంపర్లాట కూడదనీ, ప్రేమానుబంధాలే ముఖ్యమనీ చెబుతూ వచ్చిన ఓ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుని, అంతకుమించిన ఆహ్లాదాన్ని పంచి, బాక్సాఫీసు వద్ద విజయ బావుటా ఎగరేసింది. ఆ సినిమా 'నువ్వు నాకు నచ్చావ్'. ఇమేజ్‌ని పట్టించుకోకుండా ప్రతి చిత్రంలోనూ కొత్తదనం కోసం తపించే కథానాయకుడు వెంకటేశ్ ఒక్క ఫైటూలేని ఈ సినిమా చేసి, అందర్నీ ఆశ్చర్యపరచారు. విడుదలకు ముందు ఈ సినిమాకి అంచనాలెన్నో. కారణం కాంబినేషన్! దీనికి ముందు ఏడాది క్రితం కొత్త తారలు నటించగా వచ్చిన 'నువ్వే కావాలి' అనే సినిమా ఓ ప్రభంజనాన్నే సృష్టించిది. దానికి దర్శకుడు కె. విజయభాస్కర్, రచయిత త్రివిక్రం. ఆ ఇద్దరితో కలిసి వెంకటేశ్ చేసిన సినిమా కావడమే 'నువ్వు నాకు నచ్చావ్'కి క్రేజ్‌ని తీసుకొచ్చింది. పైగా 'నువ్వే కావాలి' ఫేం స్రవంతి రవికిశోర్ దీనికీ నిర్మాత. ఇది 3 గంటల 9 నిమిషాల నిడివి సినిమా. అందువల్ల ఓ అరగంట నిడివినైనా తగ్గించి, విడుదల చేయమని చాలామంది శ్రేయోభిలాషులు చెప్పారు. కానీ విజయభాస్కర్ తెరమీదకు తెచ్చిన సినిమా మీద సమర్పకుడు సురేశ్‌బాబు, నిర్మాత రవికిశోర్ పూర్తి నమ్మకాన్ని ఉంచారు. నిడివి తగ్గించకుండా రిలీజ్ చేశారు. విజయం సాధించారు. నిర్మాత నుంచి ఎగ్జిబిటర్ దాకా అందరికీ మంచి లాభాలు తీసుకొచ్చి 2001 సూపర్‌హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది 'నువ్వు నాకు నచ్చావ్'. సుమారు 7 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా 16 కోట్ల రూపాయల్ని వసూలు చేసింది.
అనంతర కాలంలో నెంబర్‌వన్ స్థాయికి ఎదిగిన ఆర్తీ అగర్వాల్ పరిచయమయ్యింది ఈ చిత్రంతోటే. వెంకటేశ్ సరసన రూపలావణ్యాలతోటే కాక, అభినయంతోనూ ఆర్తీ తెలుగు ప్రేక్షకుల హృదయాలకు గాలం వేసింది. "హీరోయిన్ నందిని పాత్రకి కొత్తమ్మాయిని పరిచయం చేయాలనుకున్నాం. సినిమాలో నందిని మాత్రమే కనిపించాలి కానీ, హీరోయిన్ కనిపించకూడదు. చాలామంది అమ్మాయిల్ని చూశాం. అప్పుడే బాలీవుడ్ సినిమా 'పాగల్‌పన్'లో హీరోయిన్‌గా కనిపించిన కొత్తమ్మాయి మా దృష్టికి వచ్చింది. న్యూజెర్సీలో తల్లిదండ్రులతో పాటు ఉంటున్న ఆమె ఆ సినిమా చేసి, మళ్లీ అక్కడకి వెళ్లిపోయిందని తెలిసింది. ఆమెని పిలిపించాం. ఇక నందిని ఆమే అని డిసైడ్ అయిపోయాం. అలా ఆర్తీ అగర్వాల్ తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది" అని చెప్పారు నిర్మాత రవికిశోర్.
సినిమాలో కీలకమైన నందిని తండ్రి మూర్తి పాత విషయంలో చెప్పుకోదగ్గ సంగతొకటుంది. ఆ పాత్రని ప్రకాశ్‌రాజ్‌తోటే చేయించాలని నిర్మాత, దర్శకుడు సంకల్పించారు. సరిగ్గా అదే టైంలో ప్రకాశ్‌రాజ్ మీద 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) నిషేధం నడుస్తోంది. దాంతో అతని బదులు మరొకర్ని తీసుకోక తప్పని స్ఠితి. "మేం మాత్రం ఆయన కాకుండా మరొకర్ని మూర్తి పాత్రలో ఊహించలేకపోయాం. అందుకని ఆయన పాత్ర వచ్చే సీన్లు మినహా మిగతా సినిమా అంతా తీసేశాం. నిషేధం ఎత్తేశాక 17 రోజుల కాల్షీట్‌తో తన పోర్షన్ పూర్తిచేశాడు ప్రకాశ్‌రాజ్" అని అప్పటి విశేషాన్ని జ్ఞాపకం చేసుకున్నారు రవికిశోర్.
కేవలం ప్రేక్షకుల రివార్డులతోటే సరిపెట్టలేదు ఈ సినిమా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు నందులు ఈ సినిమా ఖాతాలో చేరాయి. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఉత్తమ వినోదాత్మక చిత్రంతో పాటు సుచిత్రకు ఉత్తక కొరియోగ్రాఫర్‌గా, సుహాసినికి ఉత్తమ సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా, త్రివిక్రంకు ఉత్తమ సంభాషణల రచయితగా, సవితారెడ్డికి ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా నందులు దక్కాయి. సమకాలీన చిత్రాల్లో టీవీలో ఎక్కువసార్లు ప్రసారమయ్యిందీ, అత్యధిక శాతం వీక్షించిందీ ఈ సినిమానే అనడంలో అతిశయోక్తి లేదు. 'స్వీట్ అండ్ క్యూట్ ఫిల్మ్'గా పేర్కొనదగ్గ ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా మనసుకి ఆహ్లాదమే ఆహ్లాదం.

కథా సంగ్రహం:
నందిని అలియాస్ నందు (ఆర్తీ అగర్వాల్)కి పెళ్ళి నిశ్చితార్థం ఏర్పాటు చేస్తాడు తండ్రి మూర్తి (ప్రకాశ్‌రాజ్). ఆ సమయంలోనే అక్కడకి ఆయన సన్నిహిత మిత్రుడైన శేఖరం (చంద్రమోహన్) కొడుకు వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ (వెంకటేశ్) ఉద్యోగార్థం వస్తాడు. ప్రసాద్ (సిజ్జు)తో నందు నిశ్చితార్థం జరుగుతుంది. రెండు నెలల తర్వాత పెళ్లని ముహూర్తం ఖాయం చేసుకుంటారు. మూర్తి వాళ్ల ఔట్‌హౌస్‌లో దిగుతాడు వెంకీ. అతనూ, నందూ ఒకర్నొకరు ఆటపట్టించుకుంటూ ఉంటారు. వెంకీకి ఉద్యోగం వస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ నందు మనసులో వెంకీ చోటు చేసుకుంటాడు. ఓసారి ఇంట్లోని ఆడవాళ్లంతా గుడికి వెళ్తుంటే తోడుగా వెంకీ కూడా వెళతాడు. అక్కడ 'నువ్వంటే నాకిష్టం. నువ్వు నాకు నచ్చావ్' అని చెబుతుంది నందు. బిత్తరపోతాడు వెంకీ. ఇక్కడికి వచ్చేప్పుడు తండ్రి "వాడి స్నేహం పోతే భరించలేనురా. నువ్వక్కడకు వెళ్లి బాగుపడకపోయినా ఫర్వాలేదు. కానీ నీ వల్ల మా స్నేహం పాడవకుండా ఉంటే అంతే చాలు" అంటూ చెప్పిన మాటలు జ్ఞాపకమొస్తాయి. నందుకి దూరంగా ఉండటమే మంచిదనుకుని బ్యాగ్ సర్దుకుని వెళతాడు. రైల్వే స్టేషనులో మూర్తి ప్రత్యక్షమై అతణ్ని ఇంటికి తీసుకొస్తాడు.
ఊటీలో జరుగుతున్న నందు స్నేహితురాలు ఆషా (ఆషా సైనీ) పెళ్లికి వెంకీని తీసుకువెళ్తారు నందు, ఆమె బాబాయి కూతురు పింకీ. ఆషా పెళ్లవుతుంది. అక్కడ వాటర్ వరల్డ్ బాగుంటుందనీ, వెళ్లమనీ ఆషా చెబితే ముగ్గురూ వెళతారు. మధ్యలో కారు చెడిపోయిన బ్రహ్మానందం వాళ్ల కారెక్కుతాడు. వాటర్ వరల్డ్ దగ్గర చేయీ చేయీ కలిపి పట్టుకున్న వెంకీ నందూల ఫోటో తీస్తాడు బ్రహ్మానందం. నందుకి వెంకీ మరింత సన్నిహితమవుతాడు. నందు పెళ్లి దగ్గర పడుతుంది. మగపెళ్లివారు వచ్చేస్తారు. వెంకీ గదిలోకి వస్తుంది నందు. అతను ఆశ్చర్యపోతే "వెంకీ.. నేననే నీకిష్టమా, కాదా? నిజం చెప్పు" అనడుగుతుంది. "నీకు ప్రేమ కావాలి. మీ నాన్నకి పరువు కావాలి. మా నాన్నకి మీరు కావాలి. అంటే ఈ పెళ్లి జరగాలి. నువ్వెళ్లిపోవాలి. నన్ను మర్చిపోవాలి" అంటాడు వెంకీ.
మగపెళ్లివారి చేతుల్లో వెంకీ, నందూ కలిసి ఉన్న ఫోటో పడుతుంది. అది ఊటీలో బ్రహ్మానందం తీసిన ఫోటో. అది చూసి ఈ పెళ్లి చేసుకోనంటాడు ప్రసాద్. అయితే ఇది మంచి సంబంధమనీ, దీన్నడ్డం పెట్టుకుని ఇంకో కోటి రూపాయలు మూర్తి నుంచి వసూలు చేసుకోవచ్చనీ చెబుతాడు తండ్రి (తనికెళ్ల భరణి). అతని బంధువులు ఆ ఫోటోని మూర్తి చేతిలో పెడతారు. వాళ్లని తిడతాడు మూర్తి. దాంతో వారు వెళ్లిపోతారు. సంగతి తెలిసి రైల్వే స్టేషన్‌కి వెళ్లి ఆ ఫోటో అబద్ధమనీ, తనకీ నందూకీ ఏ సంబంధమూ లేదనీ చెబుతాడు వెంకీ. నందూ దేవత అనీ, ఈ పెళ్లిని జరిపించనీ వాళ్ల కాళ్లు పట్టుకోబోతాడు.
"ఈ పెళ్లే కాదు. దానికసలు పెళ్లే జరగదు. జరగనివ్వను. అదొక మహా పతివ్రత" అంటా ప్రసాద్ తండ్రి అతణ్ని నెట్టేస్తాడు. పెళ్లివారి ప్రవర్తననీ, వెంకీ వాళ్లని బతిమలాడటాన్ని చూసిన మూర్తి వెంకీని ఆగమంటాడు. పెళ్లికొడుకుని తన ఇంటి వాచ్‌మన్‌గా కూడా పనికిరాడంటూ వాళ్లని పొమ్మంటాడు. "ఐ యాం ఎ ఫూల్. నా అల్లుడు అమెరికాలో ఉన్నాడో, లేదోనని చూశాను కానీ, నా కూతురి మనసులో ఉన్నాడా, లేదా అని చూడలేదు. ఇలాంటివాణ్ని పక్కనపెట్టుకుని ఎక్కడెక్కడో వెతికా. ఐయాం సారీ వెంకీ" అని అతణ్ని కావలించుకుంటాడు. వెంకీ, నందూ ఒక్కటవుతారు.

ఆ రెండు పాయింట్లతో ఈ సినిమా తీశాం
-స్రవంతి రవికిశోర్
కథ ఎక్కువగా ఒక ఇంట్లోనే జరుగుతుంది. అందువల్ల ఔట్‌డోర్‌లోనూ కొంత కథ జరిగేటట్లు చూస్తే బాగుంటుందని సురేశ్‌బాబు సూచించారు. అప్పుడు ఊటీ ఎపిసోడ్ వచ్చి చేరింది. ఆషాసైనీ పెళ్లి తతంగం, బ్రహ్మానందం ఎపిసోడ్ అలా వచ్చి చేరాయి. న్యూజిలాండ్‌లో పాటలు తీసేప్పుడు 104 డిగ్రీల జ్వరంలో ఉండికూడా స్టెప్పులేశారు వెంకటేశ్. అలాగే క్లైమాక్స్ సీన్ చేసేప్పుడు ఆర్తీకి కూడా బాగా జ్వరం. అయినా ఎంతో నిబద్ధతతో పనిచేసింది. సినిమాకి కోటి మ్యూజిక్ ఎస్సెట్. పాటలన్నీ హిట్టే. రీరికార్డింగ్‌కి 26 రోజుల టైం తీసుకున్నారు కోటి. టీవీలో ఎన్ని వందలసార్లు వచ్చినా ఇంకా ఎంజాయ్ చేస్తున్నారంటే, ఆ సినిమా ఇచ్చే ఆహ్లాదం వల్లనే.
ప్రధానంగా రెండు పాయింట్ల మీద ఈ సినిమా చేశాం. అప్పట్లో అమెరికా క్రేజ్ బాగా ఎక్కువ. దాన్ని దృష్టిలో ఉంచుకుని అమ్మాయికి అమెరికా సంబంధం తేవడం కంటే, మనసుకి నచ్చినవాణ్ని తీసుకొస్తే ఆమె సుఖపడుతుందని చెప్పడం ఒక పాయింటైతే, తల్లిదండ్రులకు దూరంగా ఉండంటం కంటే సొంతూళ్లో ఏదో ఒక పని చేసుకుంటూ వాళ్లవద్ద ఉండటమే ఆనందకరమని చెప్పడం రెండో పాయింట్.
త్రివిక్రం, విజయభాస్కర్ కాంబినేషన్ గొప్పగా వర్కవుట్ అయిన సినిమాల్లో ఇదొకటి. సన్నివేశాల చిత్రణలో విజయభాస్కర్ టైమింగ్‌ని తక్కువ చెయ్యలేం. దానికి మేకింగ్ వాల్యూస్ తోడయ్యాయి.
'ఈ నీలి గగనాన' పాటను భువనచంద్ర రాస్తే, మిగతా అన్ని పాటల్నీ సీతారామశాస్త్రి రాశారు. 'ఒక్కసారి చెప్పలేవా' పాటను ఆయన రాసిన తీరు అమోఘం. అందులో ఎంత అర్థముంది! ఏ పాటనైనా అలవోకగా రాసే ఆయన ఆ ఒక్కపాటకు ఆరు రాత్రులు కష్టపడ్డారు. ఇప్పటి రచయితల్లో కథని ఆయన జీర్ణించుకున్నట్లు ఎవరూ జీర్ణించుకోరు. ఆయన పాటలు కథతో ట్రావెల్ చేస్తాయి. ఆయనతో పనిచేయడమన్నది గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్.
(వచ్చే వారం 'నువ్వు నాకు నచ్చావ్' విజయానికి దోహదం చేసిన అంశాలు)